తెలంగాణ, 21 డిసెంబర్ (హి.స.)
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
హాట్ హాట్ గా జరుగుతున్నాయి. ఈ రోజు సభ ప్రారంభం కాగానే.. సభలో సమయపాలన పాటించడం లేదని బీఆర్ఎస్ నేత హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు ఆయన మాట్లాడుతూ.. సభను కించపరిచేందుకు ప్రతీ రోజు ఏదో ఒక అంశాన్ని తెర మీదికి తీసుకొని రావడం బీఆర్ఎస్ నాయకులకు అలవాటుగా మారిందని, ఎప్పుడు మొదలు పెట్టామని కాదు.. ప్రజా సమస్యలపై ఎంత సేపు చర్చించామన్నదే ముఖ్యమని చెప్పారు.
అలాగే అతి ముఖ్యమైన బిల్లులలో ఏ రోజు చర్చకు రానివ్వలేని, ఆఖరికి వారు పెట్టిన ప్రివేలేజ్ మోషన్ బిల్లుపై కూడా చర్చ జరగనివ్వలేదని అన్నారు. అంతేగాక భూభారతి బిల్లు పై ప్రిపేర్ అయ్యి వస్తామని కోరితే.. సమయం ఇచ్చారని దానిని కూడా ఉపయోగించుకోకుండా చర్చ జరగనివ్వలేదని మండిపడ్డారు. ఇక సమయపాలన గురించి మాట్లాడే వీళ్ళ నాయకుడు ఇంతవరకు సభకే రాలేదని, సభా ప్రతిష్టను దిగ జారుస్తున్న దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో సభ సజావుగా సాగింది.. ఇప్పుడు జరగడం లేదన్న దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతీ రోజు ఏదో ఒక కుట్ర పన్నుతున్నారని యెన్నం ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్