దిల్లీ: 21 డిసెంబర్ (హి.స.)డిసెంబరు 13తో ముగిసిన వారంలో మన విదేశీ మారకపు నిల్వలు 1.988 బిలియన్ డాలర్లు తగ్గి 652.869 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తెలిపింది. అంతకుముందు వారంలో విదేశీ మారకపు నిల్వలు 3.235 బిలియన్ డాలర్లు తగ్గి 654.857 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ ఏడాది సెప్టెంబరు చివర్లో 704.885 బిలియన్ డాలర్ల వద్ద జీవనకాల గరిష్ఠాన్ని ఇవి తాకాయి. సమీక్షా వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు 3.047 బిలియన్ డాలర్లు తగ్గి 562.576 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. పసిడి నిల్వలు 1.121 బిలియన్ డాలర్లు పెరిగి 68.056 బిలియన్ డాలర్లకు చేరాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్) 35 మిలియన్ డాలర్లు తగ్గి 17.997 బిలియన్ డాలర్లకు పరిమితం కాగా... అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వద్ద భారత నిల్వల స్థితి 27 మిలియన్ డాలర్లు తగ్గి 4.24 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు ఆర్‌బీఐ తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల