
హుజురాబాద్, 1 నవంబర్ (హి.స.) కన్నీళ్లు తుడవాల్సిన ప్రభుత్వం కాలం కంటితుడుపు చర్యలతో గడుపుతోందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. మొంథా తుపాన్ కారణంగా పంట నష్టపోయి రోదిస్తున్న అన్నదాతలను ప్రభుత్వం తక్షణ సాయంతో ఆదుకోవాలని, కేవలం రూ.10 వేలతో కంటితుడుపు చర్యలు కాకుండా వరి పంటకు ఎకరాకు రూ.25 వేలు, పత్తి పంటకు ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారం ప్రకటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే కాంగ్రెస్ నేతలను గ్రామాల్లో తిరగనివ్వమని ఎమ్మెల్యే హెచ్చరించారు.
మొంథా తుపాన్ కారణంగా నియోజకవర్గంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన వర్షానికి పంట నష్టం జరిగిన హుజూరాబాద్ మండలంలోని జూపాక, రాంపూర్ గ్రామాల్లో పర్యటించి రైతులను పరామర్శించి ఓదార్చారు. అకాల వర్షం కారణంగా అన్నదాతల ఆరు నెలల కష్టం కష్టం బూడిద పాలు కాగా కన్నీళ్లు తుడవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 10 వేలు ప్రకటించి చేతులు దులుపుకోవడం ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి రైతుల పై ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోందని కౌశిక్ రెడ్డి అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు