భారత్‌కు పెట్టుబడుల గేట్‌వే ఏపీ.. త్వరలో డ్రోన్ ట్యాక్సీలు: సీఎం చంద్రబాబు
విశాఖపట్నం, 14 నవంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశానికి పెట్టుబడుల ముఖద్వారంగా (గేట్‌వే) తీర్చిదిద్దుతున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న
చంద్రబాబు


విశాఖపట్నం, 14 నవంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశానికి పెట్టుబడుల ముఖద్వారంగా (గేట్‌వే) తీర్చిదిద్దుతున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను, ప్రభుత్వ దార్శనికతను ప్రపంచ పారిశ్రామికవేత్తల ముందు ఆవిష్కరించారు. త్వరలోనే ఏపీ నుంచి డ్రోన్ ట్యాక్సీలను ప్రారంభిస్తామని, విశాఖలో 'ఆంధ్రా మండపం' నిర్మిస్తామని కీలక ప్రకటనలు చేశారు.

ఈ సదస్సుకు 72 దేశాల నుంచి 522 మంది విదేశీ ప్రతినిధులతో పాటు మొత్తం 2,500 మంది పారిశ్రామికవేత్తలు హాజరయ్యారని చంద్రబాబు తెలిపారు. విశాఖపట్నం అత్యంత సుందరమైన, సురక్షితమైన నగరమని, ఇక్కడి ప్రకృతి వనరులు, బీచ్‌లు, కొండలు ఎంతో ప్రత్యేకమైనవని కొనియాడారు. బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కడుతున్నారని, ఇది ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు.

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’తో అనుమతులు

గతంలో ఉన్న ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానాన్ని అధిగమించి, ప్రస్తుతం ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానంతో ముందుకెళ్తున్నామని చంద్రబాబు వివరించారు. పరిశ్రమలకు రియల్ టైమ్‌లో వేగంగా అనుమతులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రంలో 25 అనుకూలమైన పాలసీలు అమల్లో ఉన్నాయని, అవసరమైన సంస్కరణలు కూడా చేపట్టామని చెప్పారు. పరిశ్రమలకు అందించే ప్రోత్సాహకాల కోసం ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతా ఏర్పాటు చేయడంతో పాటు సావరిన్ గ్యారెంటీ కూడా ఇస్తామని సభాముఖంగా హామీ ఇచ్చారు.

టెక్నాలజీ.. గ్రీన్ ఎనర్జీపై ప్రత్యేక దృష్టి

రాష్ట్రంలో టెక్నాలజీ రంగం అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు సీఎం తెలిపారు. డ్రోన్, ఏరోస్పేస్, సెమీ కండక్టర్స్, డిఫెన్స్ కారిడార్లను ఏర్పాటు చేస్తున్నామని, త్వరలోనే ‘క్వాంటం వ్యాలీ’ని కూడా నెలకొల్పుతామని ప్రకటించారు. గూగుల్ తన అతిపెద్ద డేటా సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేస్తోందని గుర్తుచేశారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా సౌర, పవన, పంప్డ్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఏపీలో అపారంగా ఉన్న రేర్ ఎర్త్ మినరల్స్ రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని పిలుపునిచ్చారు.

పదేళ్లలో ట్రిలియన్ డాలర్ల లక్ష్యం

గత 17 నెలల కాలంలోనే రాష్ట్రానికి 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని, వీటి ద్వారా 20 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని చంద్రబాబు వెల్లడించారు. ప్రస్తుతం 0.5 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు, 50 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పనిచేస్తున్నామని, రాబోయే పదేళ్లలో 1 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షిస్తామనే విశ్వాసం ఉందని ధీమా వ్యక్తం చేశారు. సంపద సృష్టితో ‘హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ’ని నిర్మించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా విశాఖకు వచ్చిన ప్రతినిధులు అరకును సందర్శించి, గ్లోబల్ బ్రాండ్‌గా మారిన అరకు కాఫీని, స్థానిక ఆక్వా రుచులను ఆస్వాదించాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande