
కర్నూలు, 14 నవంబర్ (హి.స.)ఏపీలోని కర్నూలు ట్రిపుల్ ఐటీ (ఐఐఐటీడీఎం) విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. సాధారణ, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు లక్షల రూపాయల వార్షిక వేతనాలతో ప్రతిష్ఠాత్మక కంపెనీలలో ఉద్యోగాలు సాధించి అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఏకంగా రూ.65 లక్షలు, రూ.53 లక్షల వార్షిక ప్యాకేజీలతో ప్రముఖ కంపెనీల నుంచి ఆఫర్లు అందుకున్నారు. పట్టుదల, కఠోర శ్రమ ఉంటే ఎలాంటి లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని వారు నిరూపించారు.
రైతు బిడ్డకు రూ.65 లక్షల జాబ్
ప్రకాశం జిల్లా పెద్దఆరవీడు మండలానికి చెందిన ఏరువ మహేశ్ రెడ్డి బెంగళూరుకు చెందిన సూపర్‌మనీ కంపెనీలో రూ.65 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన మహేశ్, తన చదువు కోసం తల్లిదండ్రులు శివారెడ్డి, రమణమ్మ ఎంతో కష్టపడ్డారని తెలిపాడు. జేఈఈ మెయిన్స్‌లో మంచి ర్యాంకు సాధించి కర్నూలు ట్రిపుల్ ఐటీలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో సీటు సంపాదించాడు. కోర్సు సమయంలో సీ, సీ++ వంటి కోడింగ్ లాంగ్వేజీలపై పట్టు సాధించి, పలు ప్రాజెక్టులు చేశానని చెప్పాడు. ఇంటర్వ్యూ సమయంలో ఈ ప్రాజెక్టుల అనుభవంతో పాటు, అదనంగా నేర్చుకున్న నైపుణ్యాలు తనకు ఎంతగానో ఉపయోగపడ్డాయని వివరించాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV