
గోవా, 7 డిసెంబర్ (హి.స.)
పర్యాటక రాష్ట్రం గోవాలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి గోవాలోని ఓ నైట్ క్లబ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదం నేపథ్యంలో దాదాపు 23 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. అర్పోరా ( Arpora, Goa) ప్రాంతంలోని బిర్చ్ నైట్ క్లబ్ లో సిలిండర్ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ సంఘటనలో 23 మంది మరణించగా అందులో నలుగురు పర్యాటకులు, మిగతా అందరూ క్లబ్ సిబ్బంది ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయి, సహాయక చర్యలు ముమ్మరం చేసింది.
మృతదేహాలను గోవా మెడికల్ కాలేజీకి తరలించారు. అటు సంఘటన స్థలానికి గోవా సీఎం ప్రమోద్ సావంత్ వచ్చి పరిశీలిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే గోవా మృతులకు ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించారు. గోవాలో అగ్ని ప్రమాదం బారిన పడి మరణించిన కుటుంబాలకు రెండు లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తున్నట్లు వెల్లడించారు. అలాగే గాయపడిన వారికి 50 వేల రూపాయల చొప్పున PMNRF నిధుల నుంచి పరిహారం అందించనున్నట్లు పోస్ట్ పెట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV