వాషింగ్టన్, డి.సి., 6 జూన్ (హి.స.)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది. మస్క్‌కు కేటాయించిన ప్రభుత్వ కాంట్రాక్టులు, సబ్సిడీలను రద్దు చేయడమే బడ్జెట్‌లో బిలియన్ల డాలర్లు ఆదా చేయడానికి సులువైన మార్గమని ట్రంప్ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫాం 'ట్రూత్ సోషల్'లో పోస్ట్ చేశారు. బైడెన్ దీన్ని ఎందుకు చేయలేదో నాకు ఆశ్చర్యంగా ఉంది! అని కూడా ట్రంప్ పేర్కొన్నారు.
గత ఏడాది తన ఎన్నికల ప్రచారానికి తాను 250 మిలియన్ డాలర్లకు పైగా విరాళం ఇచ్చానని, ఆ సాయం లేకపోతే ట్రంప్ ఓడిపోయి ఉండేవాడినని మస్క్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ట్రంప్ ఈ బెదిరింపులకు దిగారు. ట్రంప్ కృతఘ్నత చూపుతున్నారని మస్క్ ఆరోపించారు. అంతకుముందు, తానే మస్క్‌ను వైట్‌హౌస్ విడిచిపెట్టమని కోరానని, దాంతో టెస్లా సీఈఓ పిచ్చిగా ప్రవర్తించారని ట్రంప్ తెలిపారు. ఎలాన్‌తో 'సహనం నశిస్తోంది', నేను అతన్ని వెళ్ళిపొమ్మన్నాను. అందరూ ఎలక్ట్రిక్ కార్లు కొనాలని బలవంతపెట్టే ఈవీ ఆదేశాన్ని (EV Mandate) నేను తీసివేశాను (ఇది నేను చేయబోతున్నానని అతనికి నెలల తరబడి తెలుసు!), దాంతో అతను పిచ్చివాడిలా ప్రవర్తించాడు అని ట్రంప్ అన్నారు. అయితే, అమెరికన్లు గ్యాసోలిన్ కార్లు కొనకుండా నిషేధించే ఎలాంటి ఫెడరల్ ఆదేశం ఎప్పుడూ లేదని సమాచారం.
గురువారం ఓవల్ ఆఫీస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ, తన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ను ఎలాన్ మస్క్ వ్యతిరేకిస్తున్నారని, దానికి కారణం ఆ బిల్లులో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహకాలు తొలగించడమేనని ట్రంప్ వ్యాఖ్యానించారు. మస్క్‌తో తన స్నేహం కొనసాగుతుందో లేదో చెప్పలేనని, బిల్లు అంతర్గత విషయాలు మస్క్‌కు తెలుసని ఆరోపించారు. దీనికి మస్క్ స్పందిస్తూ, చమురు, గ్యాస్ సబ్సిడీలను బిల్లులో కొనసాగించడం చాలా అన్యాయం!! అని ట్వీట్ చేశారు. ఈ బిల్లును నాకు ఒక్కసారి కూడా చూపించలేదు, రాత్రికి రాత్రే ఆమోదించారు, కాంగ్రెస్‌లో కూడా ఎవరూ దాన్ని చదవలేకపోయారు! అని మస్క్ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి