మాస్కో, 20 జూలై (హి.స.)
రష్యాలో ఈ రోజు మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. రష్యా తీరంలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.4గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. పెట్రోపవ్‌లావ్‌స్కీ-కామ్చాట్కా నగరానికి 144 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతకుముందు దాదాపు గంట వ్యవధిలోనే ఈ ప్రాంతంలో ఐదు భూకంపాలు నమోదైనట్లు యూఎస్‌జీఎస్ తెలిపింది.వీటిలో 7.4 తీవ్రతతో కూడిన భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. దీంతో కమ్చట్కా ద్వీపకల్పానికి పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే, ఆస్తినష్టం, ప్రాణనష్టం గురించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదు. ముందు జాగ్రత్తగా పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..