
హైదరాబాద్, 23 మే (హి.స.)
హైదరాబాద్ పోలీసింగ్ వ్యవస్థలో సరికొత్త విప్లవం ఆవిష్కృతమైంది. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు భాషా పరమైన ఇబ్బందులు కలగకుండా వారి ఫిర్యాదులను త్వరితగతిన, అత్యంత కచ్చితత్వంతో నమోదు చేసేందుకు దేశంలోనే తొలిసారిగా 'ఏఐ కాప్రొటర్' (AL Copriter) అనే కృత్రిమ మేధ (Artificial Intelligence) ఆధారిత మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. పోలీసింగ్ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ హైదరాబాద్ సిటీ పోలీస్ మరో చారిత్రాత్మక ముందడుగు వేసింది. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలో శనివారం ఏఐ కాప్టర్ యాప్ను హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ఆవిష్కరించి దాని పనితీరును పరిశీలించారు. నగరంలోని 80కి పైగా పోలీస్ స్టేషన్లలో అందుబాటులోకి రానున్న ఈ యాప్ ద్వారా, బాధితులు తమ మాతృభాషలో చెప్పే ఫిర్యాదులను పోలీసులు తక్షణమే రికార్డు చేసి, అనువదించుకోవచ్చని అధికారులు తెలిపారు.
హైదరాబాద్ వంటి మెట్రో నగరంలో తెలుగు, ఇంగ్లీష్ రాని ఇతర రాష్ట్రాల వలస కార్మికులు, పర్యాటకులు ఫిర్యాదు చేసే సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భాష అర్థం కాక ఎఫ్ఎఆర్ నమోదులో జాప్యం జరగడం, సమాచారం తప్పుగా నమోదవ్వడం వంటి సమస్యలకు ఈ యాప్ స్వస్తి పలకనుంది. 10కి పైగా ప్రధాన భారతీయ భాషలను గుర్తించే సామర్థ్యం ఈ యాప్ సొంతం. ఈ వినూత్న యాప్ ను బ్లూక్లౌడ్ సాఫ్టెక్ సొల్యూషన్స్ సంస్థతో పాటు ఇంటర్న్ పాగ్రో చందు సహకారంతో హైదరాబాద్ సిటీ పోలీస్ రూపొందించింది. హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ వంటి 10 భాషల్లో మాట్లాడితే అది వెంటనే రాతపూర్వక రూపంలోకి మారి,పోలీసులకు అర్థమయ్యే భాషలోకి అనువదిస్తుంది. గంటల తరబడి పట్టే ఫిర్యాదు ప్రక్రియను కేవలం సెకన్లలోనే పూర్తి చేయడంతో పాటు ట్రాన్స్ లేటర్ కోసం వేచి చూడాల్సిన అవసరం ఉండదు. ఫిర్యాదు రికార్డ్ చేసిన అధికారి వివరాలు, సమయం వంటివి ఆటోమేటిక్గా పీడీఎఫ్ రూపంలో నిక్షిప్తమవుతాయి. దీనివల్ల రికార్డులను తారుమారు చేసే అవకాశం ఉండదు. బాధితుడు, నిందితుడు లేదా సాక్షులు మాట్లాడే మాటలను వేర్వేరుగా గుర్తించి రికార్డ్ చేస్తుంది.
పోలీసింగ్ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ, దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఏఐ మల్టీలింగ్వల్ కంప్లైంట్ రికార్డర్ను అందుబాటులోకి తీసుకురావడం గర్వకారణమని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ అన్నారు. హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీ కావడంతో ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్ రాని వలస వచ్చిన ఇతర రాష్ట్రాల వారు, విదేశీయులు ఎందరో ఉంటారు. భాష తెలియకపోవడం వల్ల ఫిర్యాదు చేయడంలో జాప్యం జరగడం లేదా సమాచారం తప్పుగా నమోదు కావడం వంటి సమస్యలకు ఈ యాప్ చెక్ పెట్టనుందని తెలిపారు. బాధితుడు తన మాతృభాషలో మాట్లాడితే, ఈ యాప్ దానిని వెంటనే గుర్తించి, అనువదించి, అధికారిక రికార్డుగా మారుస్తుంది. మాట్లాడిన ప్రతి 5 సెకన్లకు సమాచారం అప్డేట్ అవుతుంది. ఈ సాంకేతికత వల్ల ముఖ్యంగా వలస కార్మికులు, మహిళలు, వృద్ధులకు పోలీసు సేవలపై భరోసా పెరుగుతుంది. బాధితులు చెప్పే ప్రతి మాటను యథాతథంగా నమోదు చేయడం వల్ల దర్యాప్తులో నాణ్యత పెరిగి, తద్వారా నిందితులకు శిక్ష పడే అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. పోలీసు అధికారులకు టైపింగ్ భారం తగ్గడమే కాకుండా, రికార్డుల నిర్వహణ పద్ధతి ఏకరీతిగా ఉంటుందన్నారు.
ఆధునిక పోలీసింగ్ పద్ధతుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో భాగంగా హైదరాబాద్ సిటీ పోలీస్ ఏఐని విస్తృతంగా వినియోగిస్తోంది. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ పనితీరులో మరింత సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో టెక్నాలజీ ఆధారిత పాలనకు ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో భాగంగానే.. సైబర్ క్రైమ్ ఫిర్యాదులను పక్కాగా రూపొందించడానికి ఇప్పటికే 'సి-మిత్ర' లో ఏఐ సాంకేతికతను పోలీస్ శాఖ విజయవంతంగా అమలు చేస్తోంది. అలాగే సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బందికి విధులను కేటాయించే ప్రక్రియలో ఏఐను వాడుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు