
న్యూఢిల్లీ, 23 మే (హి.స.)
దేశంలో పెట్రోల్, డీజిల్ కు ఎలాంటి
కొరత లేదని దేశంలోనే అతిపెద్ద చమురు సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) స్పష్టం చేసింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న బంకుల్లో ఇంధనం లేకపోవడం తాత్కాలిక సమస్య మాత్రమేనని, ప్రాంతీయంగా ఏర్పడిన డిమాండ్ అండ్ సప్లై కారణంగానే కొరత కనిపిస్తోందని తెలిపింది. అలాగే ఇటీవల కొనుగోలు విధానాల్లో తీసుకొచ్చిన మార్పుల కారణంగా కూడా ఈ పరిస్థితి తలెత్తిందని వెల్లడిస్తూ.. ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంధనం కొరత ఉందని ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దని, ముందస్తుగా ఇంధనాన్ని నిల్వచేసుకుని మరింత కృత్రిమ కొరత సృష్టించుకోవద్దని కోరింది.
కొన్ని ప్రాంతాల్లో ఇంధనానికి అకస్మాత్తుగా డిమాండ్ పెరగడానికి గల ముఖ్య కారణాలను 100 వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో పంట కోతల సమయం కావడం వల్ల వ్యవసాయ రంగంలో డీజిల్ వినియోగం సీజనల్గా బాగా పెరిగింది. మరోవైపు ప్రైవేట్ బంకుల్లో రిటైల్ ధరలు ఎక్కువగా ఉండటంతో, వాహనదారులు ప్రభుత్వ రంగ (PSU) బంకులకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో.. బల్క్ గా కొనుగోలు చేసే సంస్థాగత వినియోగదారులకు నేరుగా సరఫరా చేసే ధరలు భారీగా పెరిగాయి. దీనితో వారు కూడా సాధారణ రిటైల్ బంకుల నుంచే ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నారు.
ప్రస్తుత మే నెలలో గత ఏడాదితో పోలిస్తే పెట్రోల్ అమ్మకాలు 14 శాతం, డీజిల్ అమ్మకాలు దాదాపు 18 శాతం మేర పెరిగాయని సంస్థ తెలిపింది. డిమాండ్లో ఈ తరహా అసాధారణ వృద్ధి నమోదైనప్పటికీ, దేశవ్యాప్తంగా సరఫరాను నిరంతరాయంగా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా మాకున్న 42,000 కంటే ఎక్కువ ఇంధన కేంద్రాల నెట్వర్క్ కేవలం చాలా తక్కువ సంఖ్యలో ఉన్న బంకుల్లో మాత్రమే తాత్కాలికంగా సరఫరాకు అంతరాయం కలిగింది. మెజారిటీ బంకుల్లో స్టాక్ సాధారణంగానే అందుబాటులో ఉంది. అని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ యాజమాన్యం తెలిపింది.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు