
హైదరాబాద్, 24 మే (హి.స.)
దేశీయ స్టాక్ మార్కెట్లలోకి విదేశీ
పెట్టుబడులు భారీగా తరలి రావడం, అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ ఇండెక్స్ బలహీనపడటంతో భారత రూపాయి విలువ(Indian Rupee Value) బలపడింది. విదేశీ మారకద్రవ్య మార్కెట్ (Forex Market) లో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ గణనీయంగా పుంజుకుని, గడిచిన కొన్ని వారాల గరిష్ట స్థాయి వద్ద స్థిరపడింది. ప్రస్తుతం రూపాయి విలువ 1 డాలర్ కు, రూ. 95.69 వద్ద కొనసాగుతోంది. ఇది రెండు రోజుల క్రితం రూ. 96. 30 వద్ద కొనసాగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకున్న కొన్ని కీలక పరపతి చర్యలు కూడా రూపాయికి కలిసివచ్చాయని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) ధరలు కాస్త అదుపులోకి రావడం భారత ఆర్థిక వ్యవస్థకు ఊరటనిచ్చింది. చమురు దిగుమతుల కోసం భారత్ వెచ్చించే డాలర్ల భారం తగ్గడంతో రూపాయిపై ఒత్తిడి తగ్గి, మార్కెట్ ప్రారంభం నుంచే లాభాల బాట పట్టింది. రానున్న రోజుల్లో దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు (Macroeconomic Data) సానుకూలంగా ఉంటే రూపాయి మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉందని ఫారెక్స్ వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు