
గుత్తి, 24 మే (హి.స.): అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుత్తి పట్టణ శివారులోని 44వ నంబర్ జాతీయ రహదారి వన్నెదొడ్డి సమీపంలో ఓ ఇన్నోవా కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.బెంగళూరుకు చెందిన మహమ్మద్ సిరాజ్ కుటుంబ సభ్యులు బీజాపూర్లో ఉన్న తమ కుమారుడు లుక్మాన్ MBBS గ్రాడ్యుయేషన్ వేడుకకు హాజరై.. తిరిగి ఇన్నోవా కారులో బెంగళూరుకు బయలుదేరారు.
ఈ క్రమంలో గుత్తి హైవేపైకి రాగానే కారు టైర్ ఒక్కసారిగా టైర్ బరస్ట్ అయింది. దీంతో కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం వేగంగా రోడ్డుపై బోల్తా పడింది.ప్రమాద సమయంలో కారులో ఉన్న మహమ్మద్ సిరాజ్, అబ్దుల్ ఖాదర్, లుక్మాన్, జోహా, హర్షియా, హరీఫ్ భాషా సహా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి క్షతగాత్రులను తొలుత గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం వారిని అనంతపురం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV