
హైదరాబాద్, 24 మే (హి.స.)హైదరాబాద్ మహానగర భవిష్యత్తు, పారిశ్రామిక అభివృద్ధికి, రియల్ ఎస్టేట్ రంగాన్ని మలుపు తిప్పే కీలక నిర్ణయానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సుదీర్ఘ కసరత్తు తర్వాత ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్’ (HILT) పాలసీ అమలుకు రంగం సిద్ధం చేస్తూ, దాని విధివిధానాలను ఆన్లైన్లో విడుదల చేసింది. ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిధిలో ఉన్న సుమారు 9,292 ఎకరాల పారిశ్రామిక భూములను మల్టీ-యూజ్ జోన్లుగా మార్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.గత ఐదు దశాబ్దాలలో హైదరాబాద్ మహానగరం ఊహించని వేగంతో విస్తరించింది. ఒకప్పుడు నగరం వెలుపల నిర్మించిన బాలానగర్, సనత్నగర్, ఉప్పల్, జీడిమెట్ల, మల్లాపూర్ వంటి పారిశ్రామిక వాడలు ఇప్పుడు దట్టమైన జనావాసాల మధ్యకు వచ్చేశాయి. ఫ్యాక్టరీల పక్కనే అపార్ట్మెంట్లు, కాలనీలు వెలియడంతో ప్రజలు తీవ్ర కాలుష్య బారిన పడుతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా, ఓఆర్ఆర్ లోపల ఉన్న పరిశ్రమలను నగరం వెలుపలికి తరలించి, ఆ భూములను ప్రజోపయోగ ప్రదేశాలుగా మార్చడమే హిల్ట్ పాలసీ ప్రధాన ఉద్దేశం.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi