తెలంగాణ, పెద్దపల్లి. 26 జూన్ (హి.స.)
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్టీవో కార్యాలయం (RTO Office)లో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గురువారం కరీంనగర్ ఏసీబీ (ACB) డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు జిల్లా కేంద్రంలోని జిల్లా ట్రాన్స్ పోర్ట్ అధికారి, వెహికల్ ఇన్ స్పెక్టర్ కార్యాలయాలను అదుపులోకి తీసుకొని సోదాలు నిర్వహిస్తున్నారు. బయటి వారిని లోనికి, లోపల ఉన్న వారిని బయటికి వెళ్లకుండా తాళాలు వేసి సోదాలు నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారం మేరకు ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
వినియోగదాల నుంచి ప్రత్యేకంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని ఆర్టీవో అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని సమాచారంతో గురువారం ఒక్కసారిగా కార్యాలయంపై అటాక్ చేశారు.
ఈ సందర్భంగా ఆర్టీవో కార్యాలయ ఏజెంట్ లుగా వ్యవహరిస్తున్న ఏజెంట్ల సంఘం అధ్యక్షుడితో పాటుగా ఓ అధికారికి సంబంధించిన ఇద్దరు డ్రైవర్లు, ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు ఏ పనికి ఎంత తీసుకుంటున్నారు? అధికారులకు ఎంత ఇస్తున్నారు? అనే పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ దాడులు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు