కుల్గామ్ 13 జూలై (హి.స.) : అమర్‌నాథ్ యాత్ర (Amarnath Yatra) లో ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రా కన్వాయ్‌లోని మూడు బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో 10 మందికి పైగా యాత్రికులు గాయపడ్డారు. కుల్గాం జిల్లాలోని ఖుద్వానీ ప్రాంతంలోని టాచ్లూ క్రాసింగ్ సమీపంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి అనంతనాగ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. యాత్రికులు స్వల్పంగా గాయపడ్డారని, అంతా క్షేమంగా ఉన్నారని వైద్య అధికారులు ధ్రువీకరించారు.
కుల్గాం ప్రమాదంతో తాత్కాలికంగా అంతరాయం కలిగినప్పటికీ తిరిగి యాత్రా కార్యక్రమాలు ప్రారంభమైనట్టు అధికారులు తెలిపారు. ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్లు వాహనాల మధ్య తగినంత దూరం పాటించి కాన్వాయ్ ప్రోటాకాల్‌ను పాటించాలని అధికారులు సూచించారు. ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వాహనాలు ఢీకొనడానికి కారణాలపై విచారణ చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు