తెలంగాణ, సూర్యాపేట. 15 జూలై (హి.స.)
రాజకీయాలలో వ్యక్తిగత దూషణలకు తావు ఉండకూడదని, విధానాల ఆధారంగా విమర్శలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతతో వినియోగించాలని ఈ సందర్భంగా వారు సూచించారు.
ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని, అప్పుడే ప్రజాస్వామ్యం నిజంగా ఫలిస్తుందని అన్నారు. భారత యువత ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. బూతులు మాట్లాడితేనే నాయకుడు అనే భ్రమను మనం వీడాలి. ఒక నాయకుడు సిద్ధాంతాలతో నడిచినప్పుడే మంచి పాలకుడవుతాడని రామచందర్ రావు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత తన తొలి జిల్లా పర్యటన ఉమ్మడి నల్గొండ జిల్లాను ఎంచుకున్నానని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు