తెలంగాణ, రాజన్న సిరిసిల్ల. 15 జూలై (హి.స.)
బీసీల రిజర్వేషన్ల అమలుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి హాజరైన బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల అమలు వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు పేరుతో ముస్లింలకు 10% రిజర్వేషన్లు అమలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ముస్లింలను బీసీ రిజర్వేషన్ల జాబితా తొలగించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. తక్షణమే బీసీ జాబితా నుంచి ముస్లింలను తొలగించి 42 శాతం రిజర్వేషన్లను పూర్తిగా బీసీలకే దక్కేలా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 51 శాతమున్న బీసీలకు 32 శాతం మాత్రమే రిజర్వేషన్లు అమలు చేస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం 12 శాతమున్న ముస్లింలకు మాత్రం వందకు వంద శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు సిద్ధమవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం వాస్తవాలను కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. నుంచి
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు