హైదరాబాద్, 15 జూలై (హి.స.)
ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవికి గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు షాకిచ్చారు. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ ఏకంగా చిరు.. హైకోర్టును ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లో చిరంజీవికి సొంత నివాసం ఉన్న విషయం తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో 2000 సంవత్సరంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అన్ని అనుమతులు తీసుకొని మరీ నిర్మాణం చేయించుకున్నారు. అయితే.. ప్రస్తుతం ఇళ్లు నిర్మించుకొని దాదాపు 15 ఏళ్లు కావడంతో రెనోవేషన్తో పాటు మరికొన్ని నిర్మాణాలు చేసుకోవాలని మెగాస్టార్ నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఇటీవల అనుమతుల కోసం జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. సదరు మార్పులకు సంబంధించి వివరిస్తూ.. అనుమతులు కోరారు.
అయితే.. చిరంజీవి దరఖాస్తు చేసుకుని.. దాదాపు నెల రోజులు గడిచినా అనుమతులు మాత్రం రాలేదని.. దీనిపై అధికారులకు ఫోన్లు చేసినా స్పందించలేదని.. అసహనంతో హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు జోక్యం చేసుకుని.. చట్ట ప్రకారం అనుమతులు ఇప్పించాలని అభ్యర్థించారు. దీనిని తాజాగా మంగళవారం విచారించిన కోర్టు.. జీహెచ్ఎంసీ అధికారులపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అనుమతులు ఇచ్చేందుకు ఎంత గడువు కావాలని ప్రశ్నించింది. అక్రమ నిర్మాణాలకు అధికారులు ఒత్తాసు పలుకుతున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయని.. సక్రమ నిర్మాణాలకు మాత్రం అనుమతులు ఇవ్వలేరా? అని నిలదీసింది. సాధ్యమైనంత త్వరగా.. చిరంజీవి ఇంటి రెనోవేషన్ పనులకు అనుమతులు ఇవ్వాలని ఆదేశించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్