తెలంగాణ, కామారెడ్డి. 16 జూలై (హి.స.)
ఇప్పటి వరకు ఆర్టీఏ కార్యాలయాల్లో దళారులు, అధికారులపై దాడులు జరిపిన ఏసీబీ.. తాజాగా రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) చెక్పోస్టులు, కార్యాలయాలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఇవాళ తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని కామారెడ్డి జిల్లా జుక్కల్, భిక్కనూరు సరిహద్దు మండలాల పరిధిలోని పొందుర్తి, జంగంపేట ఆర్టీఏ చెక్ పోస్టుపై ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు చేశారు. కొన్నాళ్లుగా చెకోపోస్టు వద్ద వాహనాల తనిఖీలు, పన్నుల సేకరణలో అక్కడి అధికారులు ప్రైవేటు వ్యక్తులతో కలిసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా ఏసీబీకి పక్కా సమాచారం అందింది. దీంతో అదును చూసి బుధవారం అధికారులు పొందుర్తి చెక్పోస్టు వద్ద విస్తృతంగా సోదాలు చేపట్టారు. ఆఫీసు రికార్డులతో పాటు.. రశీదు బుక్కులను క్షుణ్ణంగా పరిశీలించారు. అదేవిధంగా అక్రమ వసూళ్లలో అధికారులకు సహకరిస్తున్న కొందరు ప్రైవేటు వ్యక్తులను కూడా అదుపులోకి తీసున్నట్లుగా తెలుస్తోంది. సోదాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు