హైదరాబాద్, 16 జూలై (హి.స.)
గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని క్లీన్ అండ్
గ్రీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని, అందుకు ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. బుధవారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కూకట్పల్లి జోన్ షిరిడీ హిల్స్ కాలనీలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ ఆర్వి కర్ణన్ వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు.
మొక్కల నీటి అవసరాలకు ఉద్దేశించిన బోరు మోటారును ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్లో వన మహోత్సవంలో భాగంగా ఈ సంవత్సరం ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా భాగస్వామ్యంతో 25 లక్షల మొక్కలను నాటడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ సీజన్ మొత్తం మొక్కలు నాటుతామని చెప్పారు. లక్ష్య సాధనకు నగరంలో ప్రతి ఇంటికి మొక్కలను పంపిణీ చేస్తామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..