భారత అంతరిక్ష లక్ష్యాలకు ఊపు శుభాంశు యాత్రపై నిపుణుల విశ్లేషణ
దిల్లీ, 16 జూలై (హి.స.): అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) భారత వ్యోమగామి శుభాంశు శుక్లా చేపట్టిన యాత్ర వల్ల భారత రోదసి లక్ష్యాలకు ఊతం లభిస్తుంది. సొంతంగా చేపట్టాలనుకుంటున్న మానవసహిత అంతరిక్షయాత్ర ‘గగన్‌యాన్‌’కు, భూ కక్ష్యలో అంతరిక్ష కేంద్ర
PSLV-C60 Rocket:


దిల్లీ, 16 జూలై (హి.స.): అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) భారత వ్యోమగామి శుభాంశు శుక్లా చేపట్టిన యాత్ర వల్ల భారత రోదసి లక్ష్యాలకు ఊతం లభిస్తుంది. సొంతంగా చేపట్టాలనుకుంటున్న మానవసహిత అంతరిక్షయాత్ర ‘గగన్‌యాన్‌’కు, భూ కక్ష్యలో అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి ఇది సాయపడనుంది.

సొంత రాకెట్, వ్యోమనౌక ద్వారా గగన్‌యాన్‌ను 2027లో నిర్వహించాలని భారత్‌ తలపోస్తోంది. ఈ యాత్ర కోసం జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. అలాగే భారతీయ అంతరిక్ష కేంద్రం కోసం తొలి మాడ్యూల్‌ను 2028లో కక్ష్యలోకి పంపాలని మన దేశం భావిస్తోంది. 2035 కల్లా పూర్తిస్థాయి ల్యాబ్‌ను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకొంది. 2040లో చందమామపైకి వ్యోమగామిని పంపాలనుకుంటోంది. ‘‘ఆకాంక్షను సామర్థ్యంగా మార్చుకోవడంలో శుభాంశు యాత్ర ఒక పెద్ద ముందడుగు’’ అని ఖగోళభౌతిక శాస్త్రవేత్త సోమక్‌ రాయ్‌చౌధరి తెలిపారు. ఐఎస్‌ఎస్‌లో శుభాంశు చేపట్టిన ప్రయోగాలు.. రోదసిలో సేద్యం నుంచి పదార్థ శాస్త్రం, ఆరోగ్యం, కృత్రిమ మేధ (ఏఐ) వరకూ వివిధ రంగాల్లో కొత్త అవకాశాలకు బాటలు పరుస్తాయని పేర్కొన్నారు. ఐఎస్‌ఎస్‌లో శుభాంశు గడించిన అనుభవం.. గగన్‌యాన్‌కు సాయపడుతుందని ఇస్రో పేర్కొంది. అంతర్జాతీయ సిబ్బందితో సమన్వయం చేసుకోవడం, మానసిక సన్నద్ధత, వ్యోమగామి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, ప్రయోగాల నిర్వహణ, భూకేంద్రంలోని సిబ్బందితో సమన్వయం వంటి అంశాల్లో ఇది ఉపయోగపడుతుందని వివరించింది. యాక్సియం-4 యాత్ర భారత ప్రైవేటు పరిశ్రమలు, అంతర్జాతీయ సంస్థలకు ఊతమిస్తుందని తెలిపింది. గ్రహాలను శోధించాలన్న భారత ఆకాంక్షలకు యాక్సియం-4 మిషన్‌ దోహదపడుతుందని ఇస్రోకు కీలక విడిభాగాలను సరఫరా చేసే అనంత్‌ టెక్నాలజీస్‌ సంస్థ సీఎండీ డాక్టర్‌ పావులూరి సుబ్బారావు పేర్కొన్నారు. ‘‘గ్రహాలను మన పూర్వీకులు సహజ జ్ఞానంతో అన్వేషించారు. ఇప్పుడు మనం ప్రయోగాలు, యాత్రల ద్వారా ఆ పనిని చేస్తున్నాం’’ అని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande