సీమకు జలసిరులు... రేపు నీటిని విడుదల చేయనున్న చంద్రబాబు
కర్నూలు, 16 జూలై (హి.స.) హంద్రీనీవా ఫేజ్-1 కాలువల సామర్థ్యం పెంపుతో రాయలసీమలో తాగు, సాగునీటి కష్టాలు తీరనున్నాయి. కూటమి ప్రభుత్వం వంద రోజుల్లోనే ఈ ప్రాజెక్టు పనులను పూర్తి చేసి చరిత్ర సృష్టించింది. కూటమి ప్రభుత్వం తీసుకున్న వేగవంతమైన నిర్ణయాలు, చూపిన
సీమకు జలసిరులు... రేపు నీటిని విడుదల చేయనున్న చంద్రబాబు


కర్నూలు, 16 జూలై (హి.స.) హంద్రీనీవా ఫేజ్-1 కాలువల సామర్థ్యం పెంపుతో రాయలసీమలో తాగు, సాగునీటి కష్టాలు తీరనున్నాయి. కూటమి ప్రభుత్వం వంద రోజుల్లోనే ఈ ప్రాజెక్టు పనులను పూర్తి చేసి చరిత్ర సృష్టించింది. కూటమి ప్రభుత్వం తీసుకున్న వేగవంతమైన నిర్ణయాలు, చూపిన చొరవ ఫలితంగా రాయలసీమకు జలసిరులు అందనున్నాయి. హంద్రీనీవా ఫేజ్-1 కాలువల విస్తరణ పనులు విజయవంతంగా పూర్తి కావడంతో సీమ జిల్లాలు సస్యశ్యామలం అయ్యేందుకు మార్గం సుగమం అయింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 17వ తేదీన నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద విస్తరణ పూర్తైన హంద్రీనీవా కాలువకు నీటిని విడుదల చేయనున్నారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా వంద రోజుల్లోనే ఈ కాలువ విస్తరణ పనుల లక్ష్యాన్ని పూర్తి చేసింది.

రూ.696 కోట్లతో చేపట్టిన ఈ విస్తరణ పనులతో హంద్రీనీవా ఫేజ్-1 కాలువ ప్రవాహ సామర్థ్యం 3,850 క్యూసెక్కులకు పెరిగింది. రాయలసీమకు తాగు, సాగునీరు అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫేజ్-1, ఫేజ్-2 కాలువ పనులను పరుగులు పెట్టించారు. రోజువారీ లక్ష్యాలను నిర్దేశించి పనులను వేగవంతం చేశారు. ప్రస్తుతం ఫేజ్-1 కాలువ విస్తరణతో అదనంగా 1,600 క్యూసెక్కుల నీటిని తరలించే అవకాశం ఏర్పడింది. దీనితో జీడిపల్లి రిజర్వాయర్‌ను పూర్తి సామర్థ్యంతో నింపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని ఆయకట్టుకు సాగునీరు, 33 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande