ముంబయి, 16 జూలై (హి.స.) దేశీయ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ముందురోజు లాభాల్లో కొనసాగిన సూచీలు.. మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు, రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే 100 శాతం సుంకం విధిస్తామని భారత్ (India)తో సహా చైనా, బ్రెజిల్ దేశాలకు నాటో (NATO) చేసిన హెచ్చరికలపై దృష్టిసారించిన మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 157 పాయింట్ల నష్టంతో 82,422 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 45.7 పాయింట్లు క్షీణించి 25,150 వద్ద ఉంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 27 పైసలు తగ్గి 86.03 వద్ద ఉంది. నిఫ్టీ సూచీలో ట్రెంట్, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, సిప్లా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్ స్టాక్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం మిశ్రమంగా ముగిశాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు అదే బాటలో పయనిస్తున్నాయి. జపాన్ నిక్కీ, హాంకాంగ్ స్టాక్ మార్కెట్ మాత్రం లాభాల్లో ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు