ఢిల్లీ, 2 జూలై (హి.స.)క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌పై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల కారణంగా టోర్నీ నిర్వహణపై సందేహాలు వ్యక్తమైనప్పటికీ, తాజాగా అడ్డంకులన్నీ తొలగిపోయినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ మెగా టోర్నీ సెప్టెంబర్ 5 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మేరకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అంతర్గతంగా నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
యూఏఈ వేదిక.. టీ20 ఫార్మాట్
ఈ ఏడాది ఆసియా కప్ ఆతిథ్య హక్కులు బీసీసీఐ వద్దనే ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా టోర్నమెంట్‌ను తటస్థ వేదిక అయిన యూఏఈలో నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తం 17 రోజుల పాటు సాగే ఈ టోర్నీ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. సెప్టెంబర్ 5న ప్రారంభమై, సెప్టెంబర్ 21న ఫైనల్ మ్యాచ్‌తో ముగుస్తుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్‌తో పాటు ఆతిథ్య యూఏఈ జట్లు పాల్గొననున్నాయి. గ్రూప్ దశ అనంతరం సూపర్-4 రౌండ్ నిర్వహించి, అందులో టాప్-2లో నిలిచిన జట్ల మధ్య ఫైనల్ పోరు జరుగుతుంది.
దాయాదుల పోరుకు తేదీ ఖరారు
ఈ టోర్నీలో అందరి దృష్టి భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్‌పైనే ఉంటుంది. ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం, దాయాదుల మధ్య హైవోల్టేజ్ సమరం సెప్టెంబర్ 7న జరగనుంది. ఇప్పటికే ఈ టోర్నీలో పాల్గొనే జట్లన్నీ తమ తమ దేశ ప్రభుత్వాల నుంచి అవసరమైన అనుమతులు పొందే ప్రక్రియలో ఉన్నాయని సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి