ఢిల్లీ, 23 జూలై (హి.స.)
ఇటీవల కాలంలో డిజిటల్ వినియోగం పెరిగిన నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా క్రమంగా పుంజుకుంటున్నాయి. ఈ క్రమంలో పన్ను చెల్లింపుదారులు సైతం ఈ మోసాల బారిన పడుతున్నారు. దీంతో పలు రకాల స్కామ్స్ గురించి జాగ్రత్తగా ఉండాలని ఆదాయపు పన్ను శాఖ సూచించింది. ఈ నేపథ్యంలో మీ వ్యక్తిగత వివరాలను మాన్యువల్ వెరిఫికేషన్ చేయాలని మీకు ఆదాయపు పన్ను శాఖ నుంచి ఏదైనా ఈ మెయిల్ వస్తే అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఎందుకంటే ఆ మెయిల్స్ నకిలీవి, ఫిషింగ్ స్కామ్‌లో భాగంగా వచ్చినవని (ITR Filing Scam) హెచ్చరించింది.
ఫిషింగ్ స్కామ్ అంటే ఏంటి?
ఫిషింగ్ అనేది మోసగాళ్లు ఆదాయపు పన్ను శాఖ వంటి విశ్వసనీయ సంస్థలను అనుకరిస్తూ, మీ బ్యాంక్ వివరాలు, పాస్‌వర్డ్‌లు లేదా క్రెడిట్ కార్డ్ నంబర్ల వంటి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే ప్రయత్నం చేస్తారు. వారు ఎక్కువగా వినియోగించే ఈ-మెయిల్స్ లేదా వెబ్‌సైట్‌ల మాదిరిగా ఉండే వాటిని ఉపయోగిస్తారు. కానీ అవి నకిలీవిగా ఉంటాయి.
ఈ స్కామ్ గురించి ఏం తెలుసుకోవాలి?
ఆదాయపు పన్ను శాఖ ఎప్పుడూ కూడా ఈ-మెయిల్ ద్వారా మీ PIN, పాస్‌వర్డ్, బ్యాంక్ వివరాలు లేదా క్రెడిట్ కార్డ్ సమాచారం అడగదని గుర్తుంచుకోండి
రిఫండ్‌ల కోసం లేదా మాన్యువల్ వెరిఫికేషన్ కోసం లింక్‌లు క్లిక్ చేయమని లేదా అటాచ్‌మెంట్‌లను డౌన్‌లోడ్ చేయాలని అడగదు
తెలియని ఈ-మెయిల్స్‌ను నమ్మవద్దు, వాటికి రిప్లై కూడా చేయవద్దు. అలాంటి లింక్‌లు, అటాచ్‌మెంట్‌లను కూడా ఓపెన్ చేయకూడదు.
అనుమానాస్పద లింక్‌లను కాపీ చేసి బ్రౌజర్‌లో పేస్ట్ చేయకూడదు. అవి నిజమైనవిగా కనిపించినా, ఫేక్ వెబ్‌సైట్‌కు తీసుకెళ్లే ఛాన్సుంది.
అధికారిక నోటీసుల గుర్తింపు
ఆదాయపు పన్ను శాఖ నుంచి వచ్చే అధికారిక నోటీసులు ఎల్లప్పుడూ డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్ (DIN) కలిగి ఉంటాయి.
ఈ నోటీసులు మీ అధికారిక ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి.
అధికారిక ఈ-మెయిల్ డొమైన్:
నిజమైన ఆదాయపు పన్ను శాఖ ఈ-మెయిల్స్ ఎల్లప్పుడూ incometax.gov.in డొమైన్ నుంచి వస్తాయి. ఇతర డొమైన్‌ల నుంచి వచ్చిన ఈ-మెయిల్స్ గురించి ఫిర్యాదు చేయండి.
ఏదైనా ఈ-మెయిల్ గురించి మీకు అనుమానం ఉంటే webmanager@incometax.gov.in లేదా incident@cert-in.org.inకు తెలపండి. ఇది విచారణకు సహాయపడుతుంది.
రిపోర్ట్ చేసిన తర్వాత, ఆ ఈ-మెయిల్‌ను మీ ఇన్‌బాక్స్ నుంచి తొలగించండి.
మీ ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ ఖాతాను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోండి. అధికారిక సమాచారం అంతా అక్కడే ఉంటుంది.
అనుమానాస్పద ఈ-మెయిల్స్‌ను నమ్మకండి. ఏదైనా సందేహం ఉంటే incometax.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి లేదా ఆదాయపు పన్ను శాఖను అధికారికంగా సంప్రదించండి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి