న్యూఢిల్లీ, 23 జూలై (హి.స.) ఎన్నికలకు ముందు బిహార్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్‌ఐఆర్) పార్లమెంటు ఉభయసభల్ని మంగళవారం స్తంభింపజేసింది. దీనిపై చర్చ చేపట్టాల్సిందేనని విపక్షాలు గట్టిగా డిమాండ్ చేసి, సభల్లో ఇతర కార్యకలాపాలు జరగకుండా అడ్డుకున్నాయి. చర్చ జరగాలని ఒకపక్క కోరుతూ మరోపక్క సభకు అంతరాయం కలిగించడం విపక్షాల ద్వంద్వవైఖరిని చాటుతోందని ప్రభుత్వం వ్యాఖ్యానించింది. ఎలాంటి చర్చ లేకుండానే ఉభయసభలూ బుధవారానికి వాయిదాపడ్డాయి. మధ్యాహ్న భోజన విరామంలోపే లోక్‌సభ రెండుసార్లు స్వల్ప విరామాలతో వాయిదా పడింది. మూడోసారి సమావేశమైనప్పుడూ ఇదే పరిస్థితి కొనసాగింది. విపక్ష సభ్యులు స్పీకర్ స్థానం వద్ద బైఠాయించారు. ఎస్‌ఐఆర్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వైఖరిని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. ‘‘ఆపరేషన్ సిందూర్‌పై తొలుత చర్చ చేపట్టాలని సభా వ్యవహారాల సంఘం సమావేశంలో అంగీకారం కుదిరింది. నిబంధనలకు విరుద్ధంగా నినాద ఫలకాలతో సభకు రావడం తగదు. చర్చకు సిద్ధమేనని ప్రభుత్వం చెబుతున్నా సభను అడ్డుకోవడం ఏమిటి? ఈ ద్వంద్వ ప్రమాణాలు తప్పు. రగడ సృష్టించి పార్లమెంటు సమయాన్ని వృథా చేస్తున్నారు’’ అని మండిపడ్డారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ