పట్నా, గయా: 27 జూలై (హి.స.)
బిహార్ ఎన్డీయే కూటమిలో విభేదాలు తలెత్తాయి. భాగస్వామ్య పక్షాలైన జేడీయూ, లోక్ జన్‌శక్తి పార్టీల మధ్య విమర్శలు చోటుచేసుకుంటున్నాయి. శనివారం కేంద్ర మంత్రి చిరాగ్ పాసవాన్.. ముఖ్యమంత్రి నీతీశ్‌పై తీవ్రంగా ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు భయంకరంగా ఉన్నాయని, నీతీశ్ ప్రభుత్వానికి మద్దతిచ్చినందుకు చింతిస్తున్నానని స్పష్టం చేశారు. ప్రభుత్వం నేరగాళ్లకు లొంగిపోయిందని ఘాటుగా వ్యాఖ్యానించారు. పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ మహిళపై అంబులెన్స్‌లో అత్యాచారం జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ‘ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయడానికి నేరాలు జరుగుతుంటాయి. కానీ వాటిని నియంత్రించడం ప్రభుత్వ బాధ్యత. నియంత్రించకపోతే ఈ నేరాల్లో ప్రభుత్వ హస్తం ఉండి ఉండాలి.. లేదంటే కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. వీటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని బిహార్ ప్రభుత్వాన్ని కోరుతున్నా’ అని చిరాగ్ పాసవాన్ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ