దిల్లీ: 27 జూలై (హి.స.)
కొంచెం స్వతంత్రంగా ప్రవర్తించినందుకే మాజీ ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ పదవి కోల్పోయినట్టు కనిపిస్తోందని కాంగ్రెస్ శనివారం ఆరోపించింది. ‘ధన్‌ఖడ్ నిష్క్రమణ వెనక రాజకీయ కారణాలే తప్ప రాజ్యాంగ అంశాలు లేవు. అయితే దానిపై రాజ్యాంగపరమైన అబద్ధపు మాటలతో మభ్యపెడుతున్నారు’ అని కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ అన్నారు. ధన్‌ఖడ్ వ్యవహారంలో ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థ నిర్మాణాన్నే దెబ్బతీసేలా ప్రవర్తించిందని ఆయన ఆరోపించారు. రాజ్యసభలో జస్టిస్ యశ్వంత్ వర్మకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు తీర్మానం ప్రవేశపెట్టకుండా నిరోధించడం ద్వారా ప్రభుత్వం సంకుచిత రాజకీయాలకు పాల్పడుతోందని విలేకరులతో మాట్లాడుతూ ఆయన అన్నారు. న్యాయ వ్యవస్థలో జవాబుదారీతనం విషయంలో ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మపై చర్యకు సిద్ధమంటున్న ప్రభుత్వం అలహాబాద్ హైకోర్టుకు చెందిన జస్టిస్ శేఖర్ యాదవ్‌పై అభిశంసన తీర్మాన ప్రతిపాదనను పట్టించుకోవడం లేదని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ