'హరి హర వీరమల్లు' ట్రైలర్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న పవన్ పవర్‌ఫుల్ డైలాగ్స్
అమరావతి, 3 జూలై (హి.స.) పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ''హరి హర వీరమల్లు'' సినిమా ట్రైలర్ విడుదలైంది. మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన వీరమల్లు అనే యోధుడి పాత్రలో పవన్ పవర్‌ఫుల్‌గా క‌నిపించారు. ట్రైలర్‌లోన
'హరి హర వీరమల్లు' ట్రైలర్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న పవన్ పవర్‌ఫుల్ డైలాగ్స్


అమరావతి, 3 జూలై (హి.స.) పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'హరి హర వీరమల్లు' సినిమా ట్రైలర్ విడుదలైంది. మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన వీరమల్లు అనే యోధుడి పాత్రలో పవన్ పవర్‌ఫుల్‌గా క‌నిపించారు. ట్రైలర్‌లోని భారీ యాక్షన్ సన్నివేశాలు, పవర్‌ఫుల్ డైలాగ్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

ఈ చిత్రంలో సనాతన ధర్మాన్ని కాపాడే వీరుడిగా, కోహినూర్ వజ్రాన్ని దక్కించుకోవడానికి మొఘలులను ఢీకొట్టే వీరమల్లుగా పవర్‌స్టార్‌ కనిపించనున్నారు. క్రూరమైన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ భయంకరంగా కనిపిస్తున్నారు. పవన్, బాబీల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది.

ముఖ్యంగా ఆంధీ వచ్చేసింది అనే డైలాగ్ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. పవన్ రాజకీయ ప్రస్థానాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఈ డైలాగ్ గుర్తుచేస్తోంది. అలాగే అందరూ నేను రావాలని దేవుడిని ప్రార్థిస్తారు.. కానీ మీరు మాత్రం నేను రాకూడదని కోరుకుంటున్నారు అనే సంభాషణ కూడా ఆయన ప్రస్తుత ఇమేజ్‌కు సరిగ్గా సరిపోయింద‌నే చెప్పాలి.

క్రిష్‌, జ్యోతి కృష్ణ ఈ చారిత్రక కథను భారీ హంగులతో తెరకెక్కించారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి అందించిన నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ప‌వ‌న్ స‌ర‌స‌న‌ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల‌ 24న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande