దిల్లీ , 6 జూలై (హి.స.)మాజీ సీజేఐ అధికారిక నివాసాన్ని వీలైనంత త్వరగా ఖాళీ చేయించాలని కోరుతూ సుప్రీంకోర్టు (Supreme Court) కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దిల్లీలోని కృష్ణ మీనన్ మార్గ్‌లో సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (Justice DY Chandrachud) నివాసం ఉంటున్న బంగ్లాను అత్యవసరంగా ఖాళీ చేయించాలని పేర్కొంది. జస్టిస్ చంద్రచూడ్ పదవీ విరమణ అనంతరం నిబంధనలకు విరుద్ధంగా అక్కడ ఉండటాన్ని సర్వోన్నత న్యాయస్థానం లేఖలో ప్రస్తావించింది.
‘‘కృష్ణ మీనన్ మార్గ్‌లోని 5వ నంబర్ బంగ్లాను జస్టిస్ డీవై చంద్రచూడ్ నుంచి ఆలస్యం చేయకుండా స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నాం. ఆయన పదవీ విరమణ అనంతరం బంగ్లాను ఖాళీ చేయాల్సిన గడువు ముగిసిపోయి కూడా ఆరు నెలలు అవుతోంది’’ అని సుప్రీంకోర్టు.. హౌసింగ్ అర్బన్ అఫైర్స్ (MoHUA) శాఖ కార్యదర్శికి రాసిన లేఖలో పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ