న్యూఢిల్లీ, 19 నవంబర్ (హి.స.)
మీ టూ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ మళయాలం నటుడు సిద్ధిఖికి సుప్రీం కోర్టు నుండి ఊరట లభించింది. సిద్ధిఖి తనపై అత్యాచారానికి పాల్పడినట్లుగా గతంలో ఓ యువ నటి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసులో సిద్ధికి కేరళ హైకోర్టును ఆశ్రయించారు. యాంటిసిపేటరీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ కేసు తీవ్రత దృష్ట్యా ఆయనకు యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చేందుకు కేరళ హై కోర్టు నిరాకరించింది. ఆ తరువాత కేరళ పోలీసులు సిద్ధిఖికి అరెస్ట్ వారెంట్ జారీచేశారు. అదే సమయంలో సిద్ధిఖి సుప్రీం కోర్టుకు వెళ్లి యాంటిసిపేటరీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా సుప్రీం కోర్టు ఆయనకు యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేసింది. దీంతో అరెస్ట్ నుండి సిద్ధిఖికి తాత్కాలిక ఊరట లభించింది.
సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే..
సిద్ధిఖికి యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు పలు షరతులు విధించింది. కింది కోర్టులో పాస్ పోర్ట్ అప్పగించాల్సి ఉంటుందని కోర్టు ఆదేశించింది. దర్యాప్తు అధికారులకు అందుబాటులో ఉండి సహకరించాల్సిందిగా కోర్టు స్పష్టంచేసింది. అంతేకాకుండా కింది కోర్టు చెప్పినట్లుగా నడుచుకోవాల్సి ఉంటుందని సూచించింది. న్యాయమూర్తులు బేల ఏం త్రివేది, సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్