నేటి నుండి కాలేశ్వరం ప్రాజెక్టు పై రెండవ విడత విచారణ జరుపనున్న జ్యుడీషియల్ కమిషన్
హైదరాబాద్ మే 6(హిం.స)కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన జుడీషియల్ కమిషన్ ఇవాల్టి ను
నేటి నుండి కాలేశ్వరం ప్రాజెక్టు పై రెండవ విడత విచారణ జరుపనున్న జ్యుడీషియల్ కమిషన్


హైదరాబాద్ మే 6(హిం.స)కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన జుడీషియల్ కమిషన్ ఇవాల్టి నుంచి రెండో దఫా విచారణ చేపట్టనుంది. ఈనెల 12 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుండగా, రేపు కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ బృందం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనుంది. అనంతరం ఈనెల 9న హైదరాబాద్ లో నీటిపారుదల అధికారులతో భేటీ కానుంది. బ్యారేజీల వైఫల్యాలపై ఇంజినీర్లు, నిర్మాణదారుల నుంచి వివరణ కోరుతూ నోటీసులిచ్చే అవకాశమున్నట్లు సమాచారం.

నీటిపారుదల శాఖ ఇంజినీర్లు, అధికారులతో పాటు ఆనకట్టల పనులు చేసిన గుత్తేదార్లు, సంబంధిత వ్యక్తులను మొదటి దశలో కమిషన్ విచారణకు పిలిచే అవకాశం ఉంది. ప్రజల నుంచి ఏవైనా ఫిర్యాదులు, నివేదనలు వస్తే పరిశీలించి వాటి ఆధారంగా కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలవనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఎత్తిపోతల ఆనకట్టలపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే విచారణ మొదలైంది.రెండు రోజుల క్రితమే రాష్ట్రానికి వచ్చిన కమిటీ నీటి పారుదలశాఖ అధికారులతో సమావేశమయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని కమిషన్ కోరింది. కమిషన్కు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు 9 మందితో కూడిన నోడల్ బృందాన్ని నియమిస్తూ నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి రెండు రోజుల క్రితమే ఉత్తర్వులు ఇచ్చారు.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచార్


 rajesh pande