విజయవాడ, 3 ఏప్రిల్ (హి.స.)
రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఉన్నట్టుండి వాతావరణం చల్లబడిపోయింది. ఆకాశమంతా మేఘావృతమైపోయింది. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. అకాల వర్షాల కారణంగా నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విశాదం చోటుచేసుకుంది. పదర మండలంలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు. వేరుశనగ పొలాల్లో కూలీ పనులకు వెళ్లిన సమయంలో పిడుగు పడటంతో సుంకరి సైదమ్మ (35) ఈదమ్మ, (55) అక్కడికక్కడే మృతి చెందారు.
పనికోసం వెళ్లిన వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరో మహిళ సుంకరి లక్ష్మమ్మ, గాయపడగా ఆమెను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అకాల వర్షాలతో అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మండే ఎండల్లో వర్షం కురుస్తుండడంతో ప్రజలకు కాస్త ఉపశమనం లభించినట్లైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల