అమరావతి, 1 జూలై (హి.స.)ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ స్పష్టం చేసింది. బంగాళాఖాతం, అరేబియా సముద్రాలలో ఏర్పడిన అల్పపీడనాల కారణంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా ఈ నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. వర్షాలు లేని ప్రాంతాల్లో వేడి, ఉక్కపోత ఉంటుందని స్పష్టం చేసింది.
అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కొనసాగుతూ ఉండటంతో ద్రోణి ప్రభావం కారణంగా మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. దక్షిణ కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఇదిలా ఉంటే ఇప్పటికే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఎండలు తగ్గుముఖం పట్టి పూర్తిగా వాతావరణం చల్లబడింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి