దిల్లీ: 13 జూలై (హి.స.)రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) రాజ్యసభ (Rajya Sabha)కు నలుగురిని నామినేట్ చేశారు. ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికం, మాజీ దైత్యవేత్త హర్ష్ వర్ధన్ శ్రింగ్లా, చరిత్రకారిణి డాక్టర్ మీనాక్షి జైన్, కేరళకు చెందిన ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త సదానందన్ మాస్టర్‌లను రాజ్యసభకు నామినేట్ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
దేశంలోని ప్రముఖ న్యాయవాదులలో ఉజ్వల్ నికం (Ujjwal Nikam) ఒకరు. 26/11 ముంబయి ఉగ్రదాడుల కేసు విచారణ, ఇతర హై-ప్రొఫైల్ క్రిమినల్ కేసుల్లో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా విధులు నిర్వర్తించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా తరఫున ముంబయి నార్త్ సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. కాంగ్రెస్ అభ్యర్థి వర్ష గైక్వాడ్ చేతిలో ఓడిపోయారు.
భారత మాజీ విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ అమెరికా, బంగ్లాదేశ్, థాయిలాండ్‌లకు రాయబారిగా విధులు నిర్వహించారు. కీలక దౌత్య పదవులు చేపట్టారు. 2023లో భారతదేశ G20 ప్రెసిడెన్సీకి చీఫ్ కోఆర్డినేటర్‌గా పనిచేశారు.
కేరళకు చెందిన సి. సదానందన్ మాస్టర్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తించారు. సామాజిక కార్యకర్తగా.. భాజపా నేతగా కొనసాగుతున్నారు. 1994లో సీపీఎం నేతల దాడిలో ఆయన రెండు కాళ్లు పోగొట్టుకున్నారు. ఈ ఘటన అప్పట్లో రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది.
మీనాక్షి జైన్ (Meenakshi Jain) ప్రముఖ చరిత్రకారిణిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అసోసియేట్ ప్రొఫెసర్‌గానూ విధులు నిర్వర్తించారు. విద్యా రంగంలో ఆమె చేసిన కృషికి గాను 2020లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ సభ్యురాలిగానూ పని చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ