కర్నూలు, 17 జూలై (హి.స.)స్వాతంత్ర్యానికి పూర్వం, స్వాతంత్ర్యం తర్వాత రాయలసీమ ప్రాంతంలో శాంతి భద్రతల పరిస్థితుల్లో ఎటువంటి వ్యత్యాసం కనిపించలేదు.. ఫ్యాక్షనిస్టుల మధ్య ఏర్పడిన వ్యక్తిగత కక్ష్యలు కుటుంబాలకు, వ్యక్తులకు మధ్య పోరాటంగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే ఆ ఫ్యాక్షన్ గొడవలు లేకుండా ఉందనుకునేలోపు ఆశ్చర్యకరమైన రీతిలో అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో తీవ్రవాద కార్య కలాపాలతో సంబంధం ఉన్న అబూబకర్ సిద్ధిఖీ, మహమ్మద్ అలీ అనే ఇద్దరు సోదరులను తమిళనాడు ఏ.టి.ఎస్ (యాంటీ టెర్రరిస్ట్ సర్వీస్) పోలీసులు వలపన్ని, అరెస్టు చేయడంతో రాయల సీమలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
ఆ వ్యక్తులు ఇద్దరూ తమిళనాడులో అనేక జాతి వ్యతిరేక కార్యకలాపాలలో పాలుపంచుకున్నట్లు తమిళనాడు పోలీసుల ద్వారా మీడియా సంస్థలకు విషయం అందింది. 30 సంవత్సరాలుగా రాయచోటిలో మకాం వేసి, అక్కడే పెళ్లి చేసుకుని, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ, స్థానిక ముస్లింలతో జీవనం సాగిస్తున్న వీరిని వ్యూహాత్మకంగా పట్టుకున్న ఏటిఎస్ అధికారులను అభినందించాల్సిందే!
ఆంధ్రప్రదేశ్‌లోనే ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్న పట్టణం రాయచోటి.. ఇక్కడి ముస్లిం మైనార్టీల జీవన విధానం విభిన్నంగా ఉంటుంది. ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లే వారి సంఖ్య ఎక్కువ. లేదా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని జీవనం సాగిస్తుంటారు. ఈ ప్రాంతం మత సామరస్యానికి నిలయంగా ఉంటుంది. ఇలాంటి ప్రశాంతమైన పట్టణంలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను అరెస్టు చేసిన తర్వాత కలకలం చెల రేగింది. వీరు చాలా కాలం ఎవరికీ అనుమానం రాకుండా కొనసాగారు. వీరు పట్టుబడ్డాక వీరి గృహాల్లో తనిఖీ చేస్తే తీవ్రవాద సాహిత్యం, బాంబుల తయారీకి ఉపయోగించే మెటిరియల్స్ బయటపడడం, ఇల్లు తనిఖీ చేసే సమయంలో సదరు వ్యక్తుల భార్యలు పోలీసులు పైకి తిరగబడడం వంటి విషయాలను లోతుగా విశ్లేషిస్తే.. రాయచోటి ప్రాంతం తీవ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా మారిందని, ఇందుకు కొందరు స్థానిక ప్రజలు, అధికార, ప్రతిపక్ష రాజకీయ నాయకులు సహకారం అందిస్తున్న విషయం కూడా బయటపడింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి