అమరాతవి, 1 అక్టోబర్ (హి.స.)
ఏపీ, తెలంగాణను వరుణుడు ఏమాత్రం వదిలిపెట్టడంలేదు.. మొన్నటి వాయుగుండం ఎఫెక్ట్ మరువక ముందే.. మరో అల్పపీడనం భయపెడుతోంది. వాయుగుండంగా మారి అవకాశం ఉండడంతో ఏపీ, తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు తప్పవంటోంది వాతావరణశాఖ.
వానలే.. వానలే.. మళ్లీ మళ్లీ వానలు.. ఏపీ, తెలంగాణలో గత కొన్ని నెలలుగా ఇవే పరిస్థితులు.. ఆ కాలం.. ఈ కాలం అనే తేడా లేకుండా గ్యాప్‌ల వారీగా వర్షాలు కుమ్మేస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో కుండపోతను మించి ముంచేస్తున్నాయి. మొన్నటికిమొన్న బంగాళాఖాతంలోని వాయుగుండం ప్రభావంతో రెండు, మూడు రోజులపాటు తెరపివ్వకుండా భారీ వర్షాలు కురిశాయి. ఇప్పుడు మరోసారి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది.
ఆవర్తనం ప్రభావంతో, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వాయువ్య దిశగా కదిలి పశ్చిమమధ్య, ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో గురువారం (సెప్టెంబర్ 2) నాటికి వాయుగుండంగా బలపడుతుందని తెలిపింది. శుక్రవారం ఉదయానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో.. ఏపీకి వారం రోజుల పాటు వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రధానంగా.. పార్వతీపురం మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వీటితోపాటు.. ఏలూరు, కృష్ణా జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది వాతావరణశాఖ.
మరోవైపు… తెలంగాణలోనూ మరో మూడు, నాలుగు రోజుల వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణశాఖ ప్రకటించింది. తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. గురు, శుక్రవారాల్లో మాత్రం ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి