అమరావతి, 1 అక్టోబర్ (హి.స.)
మచిలీపట్నం కార్పొరేషన్,: దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా భక్తులు అమ్మవారిపై ఉన్న భక్తిని వివిధ రూపాల్లో చాటుకుంటారు. మచిలీపట్నానికి చెందిన తాడేపల్లి సుజాత అరుదైన కానుక సమర్పించారు. శరన్నవరాత్రుల్లో లలితసహస్రనామపారాయణం అనేక దేవాలయాల్లో నిర్విరామంగా జరుగుతుంటుంది. కొందరు లలితసహస్రనామ పారాయణాన్ని చీరలపై ముద్రించడం, మగ్గంపై నేసి అమ్మవారికి కానుకగా ఇస్తుంటారు. సుజాత తొలుత చీరపై లలిత సహస్రనామ పారాయణాన్ని చేతితో రాసి అక్షరాల వెంబడి వివిధ రకాల దారాలతో సూదితో కుట్టారు. ఏడాది పాటు కష్టపడి చీరపై లలితాసహస్రనామాన్ని తీర్చిదిద్దడం విశేషం. ఆ చీరను కృష్ణాజిల్లా గూడూరు మండలంలోని ఐదుగుళ్లపల్లిలో వేంచేసియున్న శ్రీ పార్వతీసమేత సోమేశ్వర ఆలయంలో అమ్మవారికి సమర్పించారు. ఆమె అమ్మవారి పట్ల చూపిన భక్తి, చీరను భిన్నంగా తీర్చిదిద్దిన తీరును పలువురు ప్రశంసిస్తున్నారు. అమ్మవారి దయతోనే తాను అలా చీరను తీర్చిదిద్దగలిగానని ఆమె చెబుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ