హైదరాబాద్, 10 అక్టోబర్ (హి.స.)
భారీ వర్షాలతో హైదరాబాద్ లో వరదలు రావడానికి కారణం చెరువల ఆక్రమణ కాదని.. నాలా ల ఆక్రమణే ప్రధాన కారణమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ఇవాళ హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం నగర వ్యాప్తంగా నాలాల ఆక్రమణలను తొలగించేందకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా నాలాల పునరుద్ధరణకు త్వరలోనే ఓ నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
హైడ్రా ఏర్పాటు అయిన నాటి నుంచి కాపాడిన ప్రభుత్వం ఆస్తుల విలువ రూ.50 వేల కోట్లకుపైనే ఉంటుందని తెలిపారు. వెయ్యి ఎకరాల్లో రికవరీ చేస్తే.. అందులో ఎక్కువగా పెద్ద తలకాయల నంచి వచ్చాయని కామెంట్ చేశారు. మరో 9 నెలల్లో నగరంలో నాలాల పునరుద్ధరణ ప్రక్రియ పూర్తి చేసి చూపిస్తామని అన్నారు. బతుకమ్మ కుంట 10 ఎకరాలు ఆక్రమణకు గురైతే.. అందులో కనీసం 5 ఎకరాలైనా రికవర్ చేయగలిగామని తెలిపారు. గతంలో నాలాలు విస్తీర్ణంలో పెద్దగా ఉండేవని కాలక్రమేణ అవి పూర్తిగా ఆక్రమణకు గురై కుచించుకుపోయాయని అన్నారు. ప్రస్తుతం వాటి వెడెల్పును పునరుద్ధరించడమే తన లక్ష్యమని హైడ్రా చీఫ్ రంగనాథ్ అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు