హైదరాబాద్, 10 అక్టోబర్ (హి.స.)
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను అన్ని ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పేరును గులాబీ బాస్ ఖరారు చేశారు. ఇక అధికార కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ఏఐసీసీ డిక్లేర్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న నవీన్ యాదవ్కు, బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు బంధుత్వం ఉంది. ఈ క్రమంలోనే ఆయన సొంత పార్టీ అభ్యర్థి వైపు నిలుస్తారా.. లేక బంధుత్వం పేరుతో నవీన్ యాదవ్ గెలుపునకు పని చేస్తారా అనేది సస్పెన్స్ మారింది.
దీంతో తనపై వస్తున్న అనుమానాలు, అపోహలకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎండ్ కార్డ్ వేశారు. ఇవాళ ఆయన సికింద్రాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.. నవీన్ యాదవ్తో బంధుత్వం వేరు.. బీఆర్ఎస్ పార్టీతో తనకు ఉన్న అనుబంధం వేరని కామెంట్ చేశారు. తాను ఏ పార్టీలోకి వెళ్లలేదని.. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేశారు. అలాంటప్పుడు తాను నవీన్ యాదవ్కు ఎలా మద్దుతు ఇస్తా అంటూ క్లారిటీ ఇచ్చారు. నవీన్ తో తనకు బంధుత్వం ఉన్న మాట వాస్తవమేనని.. గతంలో అతడికి రాజకీయ సూచనలు ఇచ్చానని గుర్తు చేశారు. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని.. ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని తేల్చేశారు. గురువారం ఆర్టీసీ బస్సు చార్జీలకు వ్యతిరేకంగా.. కేటీఆర్ తో కలిసి బస్ భవనక్కు వెళ్లానని, పార్టీ కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో పాల్గొంటున్నానని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు