ఢిల్లీ నుంచి చైనాకు డైరెక్ట్ ప్లైట్స్... ఇండిగో ప్రకటన
ఢిల్లీ , 12 అక్టోబర్ (హి.స.) భారత్, చైనా మధ్య సుమారు ఐదేళ్ల విరామం తర్వాత విమానయాన సంబంధాలు మళ్లీ బలపడుతున్నాయి. ప్రముఖ బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో ఈ దిశగా మరో కీలక ముందడుగు వేసింది. ఢిల్లీ నుంచి చైనాలోని గ్వాంగ్‌జౌ నగరానికి రోజువారీ డైరెక్ట్ వ
ఢిల్లీ నుంచి చైనాకు డైరెక్ట్ ప్లైట్స్... ఇండిగో ప్రకటన


ఢిల్లీ , 12 అక్టోబర్ (హి.స.) భారత్, చైనా మధ్య సుమారు ఐదేళ్ల విరామం తర్వాత విమానయాన సంబంధాలు మళ్లీ బలపడుతున్నాయి. ప్రముఖ బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో ఈ దిశగా మరో కీలక ముందడుగు వేసింది. ఢిల్లీ నుంచి చైనాలోని గ్వాంగ్‌జౌ నగరానికి రోజువారీ డైరెక్ట్ విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

ఇండిగో వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ మార్గంలో ఎయిర్‌బస్ ఏ320 విమానాన్ని నడపనున్నారు. ఢిల్లీలో రాత్రి 9:45 గంటలకు బయలుదేరే విమానం, మరుసటి రోజు ఉదయం 4:40 గంటలకు గ్వాంగ్‌జౌ చేరుకుంటుంది. తిరిగి గ్వాంగ్‌జౌలో ఉదయం 5:50 గంటలకు బయలుదేరి, అదే రోజు ఉదయం 10:10 గంటలకు ఢిల్లీకి చేరుకుంటుంది. ఈ సర్వీసులకు సంబంధించిన టికెట్ల బుకింగ్ ఇప్పటికే తమ వెబ్‌సైట్‌లో ప్రారంభమైనట్లు సంస్థ తెలిపింది. ఇటీవలే కోల్‌కతా నుంచి గ్వాంగ్‌జౌకు కూడా ఇండిగో విమాన సర్వీసులను ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఈ కొత్త సర్వీసులపై ఇండిగో గ్లోబల్ సేల్స్ హెడ్ వినయ్ మల్హోత్రా మాట్లాడుతూ, కోల్‌కతా తర్వాత ఇప్పుడు ఢిల్లీ నుంచి కూడా చైనాకు కనెక్టివిటీని పెంచుతున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సర్వీసుల పునరుద్ధరణ వల్ల ఇరు దేశాల మధ్య సాంస్కృతిక మార్పిడి, ఆర్థిక సహకారం మరింత పెరుగుతుంది. వాణిజ్యం, పెట్టుబడులు, పర్యాటకం, విద్యా రంగాల్లో అవకాశాలు మెరుగుపడతాయని మేము విశ్వసిస్తున్నాం అని వివరించారు.

2020 నుంచి ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష ప్యాసింజర్ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఇటీవలే భారత విదేశాంగ శాఖ ఇరు దేశాల మధ్య విమాన సేవలను పునఃప్రారంభించడానికి అంగీకారం కుదిరిందని ప్రకటించిన నేపథ్యంలో ఇండిగో ఈ నిర్ణయం తీసుకుంది. విమాన సేవలు మళ్లీ ప్రారంభం కావడం వల్ల ఇరు దేశాల వ్యాపార వర్గాలకు ప్రయాణం సులభతరం అవుతుందని, పర్యాటక రంగం కూడా పుంజుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇదే క్రమంలో, ఇండిగో మరో కీలక ప్రకటన కూడా చేసింది. ఢిల్లీ నుంచి వియత్నాం రాజధాని హనోయికి డిసెంబర్ 20 నుంచి రోజువారీ డైరెక్ట్ విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande