ఢిల్లీ, 14 అక్టోబర్ (హి.స.)ఏపీని టెక్నాలజీ హబ్‌గా మార్చే ప్రయత్నాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక ముందడుగు వేసింది. టెక్ దిగ్గజం గూగుల్.. విశాఖపట్నంలో 1 గిగావాట్ సామర్థ్యంతో హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో మంగళవారం ఢిల్లీలో ఒక కీలక అవగాహన ఒప్పందం (ఎమ్ఓయూ) కుదుర్చుకుంది. తాజ్‌మాన్‌సింగ్ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ హాజరయ్యారు.
ఈ ఒప్పందం ద్వారా గూగుల్ సుమారు 10 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.88,628 కోట్లు) పెట్టుబడి పెట్టనుంది. ‘గూగుల్ ఏఐ హబ్’ పేరుతో ఏర్పాటయ్యే ఈ కేంద్రం, భారతదేశంలోనే మొట్టమొదటి కృత్రిమ మేధస్సు కేంద్రంగా నిలవనుంది. అమెరికా వెలుపల గూగుల్ నిర్మిస్తున్న అతిపెద్ద డేటా సెంటర్ కూడా ఇదే కావడం విశేషం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌తో పాటు గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే తదితరులు పాల్గొన్నారు.
భారీ ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ఊతం లభించనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2028-2032 మధ్య కాలంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తికి ఏటా రూ.10,518 కోట్లు అదనంగా సమకూరవచ్చని భావిస్తున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా, ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 1,88,220 ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా. ఈ డేటా సెంటర్ రాకతో విశాఖ నగరం పూర్తిస్థాయి ‘ఏఐ సిటీ’గా రూపాంతరం చెందనుంది.
గతేడాది అక్టోబర్‌లో మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన సందర్భంగా గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్‌తో జరిపిన చర్చలే ఈ ఒప్పందానికి పునాది వేశాయి. ఈ డేటా సెంటర్‌తో పాటు విద్యుత్, రియల్ ఎస్టేట్, టెలికమ్యూనికేషన్స్ వంటి అనుబంధ రంగాల అభివృద్ధికి కూడా మార్గం సుగమం అవుతుంది. దీని ద్వారా రాష్ట్రానికి పన్నుల రూపంలో కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV