పాట్నా, 16 అక్టోబర్ (హి.స.)
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ (పీకే) ప్రకటించడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నిర్ణయంపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఘాటుగా స్పందించారు. యుద్ధం ప్రారంభం కాకముందే సేనాని పారిపోయాడు. ఇక సైన్యం పరిస్థితి ఏంటి? అంటూ ఆయన పీకేను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు పాట్నా చేరుకున్న అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పీకే నిర్ణయం, ఆయన పార్టీ భవిష్యత్తుపై తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అంతకుముందు రోజు, తాను ఎన్నికల బరిలో నిలబడటం లేదని ప్రశాంత్ కిషోర్ ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. పార్టీ సంస్థాగత పనులపైనే పూర్తిగా దృష్టి సారించాలని జన్ సూరజ్ నిర్ణయించిందని, అందుకే తాను పోటీకి దూరంగా ఉంటున్నానని ఆయన తెలిపారు. ఇదే సమయంలో, బీహార్‌లో అధికార ఎన్డీయే ఓటమి ఖాయమని పీకే జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ తిరిగి రాలేరని, ఆయన నేతృత్వంలోని జేడీయూ 25 సీట్లు గెలవడం కూడా కష్టమేనని అన్నారు. తమ పార్టీకి 150 సీట్ల కంటే తక్కువ వస్తే అది ఓటమి కిందే లెక్క అని ఆయన పేర్కొన్నారు.
పీకే నిర్ణయంపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా కూడా విమర్శలు గుప్పించారు. ప్రశాంత్ కిషోర్ ఒక తెలివైన వ్యాపారవేత్త, ఎన్నికల ప్రచారకర్త. క్షేత్రస్థాయిలో పరిస్థితి అనుకూలంగా లేదని ఆయనకు అర్థమైంది. ఈ ఎన్నికల్లో ఓడిపోతే భవిష్యత్తులో తన వ్యాపారానికి గిరాకీ ఉండదనే భయంతోనే పోటీ నుంచి తప్పుకున్నారు అని పూనావాలా ఆరోపించారు.
ఇదే సందర్భంలో, బీజేపీ ప్రకటించిన 101 మంది అభ్యర్థుల్లో ఒక్క ముస్లిం కూడా లేకపోవడంపై అడిగిన ప్రశ్నకు అనురాగ్ ఠాకూర్ బదులిచ్చారు. మేము గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తాం. మతం, కులం ఆధారంగా ప్రజలకు సౌకర్యాలు కల్పించం. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్‌కే మా ప్రాధాన్యత అని ఆయన వివరించారు.
కాగా, బీహార్‌లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV