body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf2{font-family:Garamond;font-size:11pt;}.cf3{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ,17, అక్టోబర్ (హి.స.)
కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఉన్న ఆశన్న ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ఎదుట శుక్రవారం లొంగిపోయారు. జగదల్‌పూర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో 208 మావోయిస్టులతో కలిసి ఆయన ఆయుధాలు అప్పగించారు. ఇందులో 110 మంది మహిళా మావోయిస్టులు ఉండడం గమనార్హం.
ఆశన్న అసలు పేరు తక్కపల్లి వాసుదేవరావు. ములుగు జిల్లా వెంకటాపురం ఆయన స్వస్థలం. బైరంగూడా అడవుల్లో దశాబ్దాలుగా అండర్‌గ్రౌండ్‌గా జీవనం కొనసాగిస్తూ వచ్చారు. 2003లో చంద్రబాబుపై అలిపిరిలో జరిగిన దాడి, మాజీ మంత్రి మాధవరెడ్డి, IPS అధికారి ఉమేశ్ చంద్ర హత్యలకు ప్రధాన సూత్రధారిగా ఆయనకు పేరుంది. అలాంటి కీలక నేత లొంగుబాటును మావోయిస్టులకు భారీ దెబ్బ అనే చెప్పొచ్చు. లొంగిపోవాలని నిర్ణయించుకున్న వాళ్లు తనను సంప్రదించవచ్చని తన చివరి ప్రసంగంలో ఆయన దళ సభ్యులకు సూచించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే..
మల్లోజుల, ఆశన్న.. రేపు ఎవరా? అనే చర్చ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం మావోయిస్ట్ పార్టీకి మరో ఝలక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం కమిటీ సభ్యుడు బండి ప్రకాశ్(Bandi Prakash) లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి ద్వారా లొంగుబాటు యత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
బండి ప్రకాశ్ అలియాస్ ప్రభాత్, అశోక్, క్రాంతి.. స్వస్థలం మంచిర్యాల జిల్లా మందమర్రి. ప్రకాశ్ తండ్రి సింగరేణి కార్మికుడు. 1982–84 మధ్య గో టు ద విలేజెస్ ఉద్యమం ద్వారా రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (RSU) తరఫున పోరాడారు. ఆపై మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎదిగాడు. అయితే అనారోగ్య కారణాలతో ఆయన లొంగిపోవడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. అన్నీ సవ్యంగా జరిగితే.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేదా డీజీపీ లేకుంటే స్థానిక పోలీసుల ఎదుట బండి ప్రకాశ్ లొంగిపోయే ఛాన్స్ ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ