*ఢిల్లీ,18, అక్టోబర్ (హి.స.)**బెల్జియం జైల్లో ఉన్న ఆర్థిక నేరగాడు మేహుల్ చోక్సీని భారత్‌కు అప్పగించేందుకు అక్కడి న్యాయస్థానం అంగీకరించింది. బెల్జియం పోలీసులు ఆయనను అరెస్టు చేయడం సబబేనని కూడా పేర్కొంది. ఈ తీర్పును సవాలు చేసేందుకు కూడా చోక్సీకి కోర్టు అవకాశం ఇవ్వడంతో ఆయనను భారత్‌కు తరలించేందుకు భారత అధికారులకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే, ఇది సానుకూల పరిణామమని భారత్ వర్గాలు చెబుతున్నాయి. మేహుల్‌ను స్వదేశానికి చేర్చే ప్రక్రియలో ఇది కీలకమైన తొలి అడుగని వ్యాఖ్యానించాయి (
విచారణ సందర్భంగా భారత్ తరపు న్యాయవాదుల వాదనలతో కోర్టు ఏకీభవించింది. చోక్సీపై మోపిన నేరపూరిత కుట్ర, మోసం, ఆధారాల ధ్వంసం, అవినీతి తదితర ఆరోపణలు బెల్జియం చట్టాల ప్రకారం శిక్షార్హమైన నేరాలని పేర్కొంది. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను స్వదేశానికి తరలించొచ్చని అభిప్రాయపడింది. చోక్సీ కేసులో ఆధారాలను సమర్పించేందుకు సీబీఐ అధికారులు ఇప్పటికే మూడు సార్లు బెల్జియం వెళ్లి వచ్చారు. ఈ ప్రక్రియలో ఐరోపాకు చెందిన ఓ న్యాయవాద సంస్థ సాయం కూడా తీసుకుంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ