ఢిల్లీ,18, అక్టోబర్ (హి.స.)** పంజాబ్‌లో ఘోర రైలు ప్రమాదం తప్పింది. అమృత్‌సర్-సహర్సా గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో రైలును ఆపడానికి ఒక ప్రయాణీకుడు గొలుసు లాగాడు. దీంతో ట్రైన్ ఆగడంతో వెంటనే ప్రయాణికులంతా కోచ్ నుంచి సురక్షితంగా బయటకు దిగేశారు. ఈ క్రమంలో ఒకరికి స్వల్పగాయాలు అయినట్లు అధికారి తెలిపారు.
శనివారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో రైలు నంబర్ 12204 అమృత్‌సర్ నుంచి సహర్సా వెళ్తుండగా ఒక్కసారి మంటలు అంటుకున్నాయి. ఏసీ కోచ్ జీ-19లో మంటలు వ్యాపించాయి. మరో రెండు కోచ్‌లకు కూడా స్వల్పంగా మంటలు తాకాయి. ఈ మూడు కోచ్‌లను వెంటనే రైల్వే సిబ్బంది అప్రమత్తమై రైలు నుంచి వేరు చేసేశారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే ఈ ఘటనలో ఒక్క ప్రయాణికుడికే స్వల్ప గాయాలు అయ్యాయని రైల్వేబోర్డు తెలిపింది. 32 ఏళ్ల మహిళకు గాయాలు కావడంతో ఫతేఘర్ సాహిబ్‌లోని సివిల్ ఆస్పత్రికి తరలించినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ రత్తన్ లాల్ వెల్లడించారు. ఇక పెద్ద ప్రమాదం తప్పడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ప్రయాణికులను ప్రత్యామ్నాయ మార్గంలో గమ్యస్థానాలకు తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక ప్రమాదానికి గల కారణాలను కూడా తెలుసుకుంటున్నట్లు చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ