*ఢిల్లీ,18, అక్టోబర్ (హి.స.)** రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్) కార్యకలాపాలను నిషేధించాలంటూ మంత్రి ప్రియాంక్ ఖర్గే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాసిన లేఖ కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నందుకు ఓ ప్రభుత్వ ఉద్యోగిపై కర్ణాటక ప్రభుత్వం వేటు (Karnataka suspends government official) వేసింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సిర్వార్ తాలూకా పంచాయతీ అభివృద్ధి అధికారి ప్రవీణ్ కుమార్ అక్టోబర్ 12న లింగసుగూర్‌లో జరిగిన ఆరెస్సెస్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆయన ఆరెస్సెస్ యూనిఫాం ధరించి.. కర్ర పట్టుకొని రూట్ ఊరేగింపులో కవాతు చేస్తున్న దృశ్యాలు ఉన్నతాధికారుల దృష్టిలో పడ్డాయి.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ప్రవీణ్ కుమార్ ఆరెస్సెస్ (RSS) కార్యకలాపాల్లో పాల్గొనడంతో అతడిపై సస్పెన్షన్ వేటు విధించినట్లు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అరుంధతి చంద్రశేఖర్ పేర్కొన్నారు. దీనిపై శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశించారు. ప్రవీణ్ కుమార్ లింగసుగూర్ ఎమ్మెల్యే మనప్ప వజ్జల్ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా కూడా పని చేస్తున్నాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ