బులంద్‌షహర్/ఢిల్లీ,19, అక్టోబర్ (హి.స.)ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లోని NH-34లో ఒక పెద్ద ప్రమాదం జరిగింది. రన్నింగ్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఖుర్జా దేహత్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న జాతీయ రహదారి 34పై ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 80 మంది ప్రయాణికులతో బస్సు దాద్రి నుండి హర్దోయ్‌కు వెళ్తుండగా బులంద్‌షహర్ వద్దకు రాగానే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును ఆపేశాడు. తర్వాత బస్సులో ఉన్న ప్రయాణికులందరిని కిందకు దించాడు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. ఇక రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది చాలా సేపు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. కానీ ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్దమై పోయింది. ఈ మంటల్లో ప్రయాణికులకు సంబంధించి లగేజ్ కూడా కాలిపోయినట్టు తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ