శ్రీనగర్/ఢిల్లీ,19, అక్టోబర్ (హి.స.) జమ్మూకశ్మీర్‌కు వేగంగా రాష్ట్ర ప్రతిపత్తిని తిరిగి సాధించడానికి భాజపాతో పొత్తు పెట్టుకునేది లేదని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శనివారం స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌లో అధికారం కట్టబెడితే రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరిస్తానని పార్లమెంటు, సుప్రీంకోర్టు, ఎన్నికల ప్రణాళికలో ఎక్కడా భాజపా పేర్కొనలేదని గుర్తుచేశారు. గతంలో పీడీపీ-భాజపా ఉమ్మడి సర్కారు వల్ల జమ్మూకశ్మీర్‌కు చాలానష్టం జరిగిందనీ, భాజపాతో చేతులు కలిపి మళ్లీ పాత తప్పును పునరావృతం చేయాలనుకోవడం లేదని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేతగా ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. తాను జమ్మూకశ్మీర్ రాష్ట్రంగా ఉన్నప్పుడూ, కేంద్రపాలిత ప్రాంతమైనప్పుడూ ముఖ్యమంత్రిగా పనిచేశాననీ, హోదా మారడం వల్ల కష్టనష్టాలేమిటో తనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదన్నారు. సుప్రీంకోర్టు విచారణలో ఉన్న పిటిషన్‌లో తానూ భాగస్వామినయ్యే విషయం గురించి న్యాయవాదులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ