దీపావళి వేడుకలు జరుపుకోవద్దు... పార్టీ నేతలకు హీరో విజయ్ ఆదేశం
చెన్నై, 19 అక్టోబర్ (హి.స.)నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గత నెలలో కరూర్ బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి జ్ఞాపకార్థం ఈ ఏడాది దీపావళి వేడుకలకు దూరంగా ఉండాలని తమ పార
vijay


చెన్నై, 19 అక్టోబర్ (హి.స.)నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గత నెలలో కరూర్ బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి జ్ఞాపకార్థం ఈ ఏడాది దీపావళి వేడుకలకు దూరంగా ఉండాలని తమ పార్టీ శ్రేణులకు, మద్దతుదారులకు పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది.

కరూర్‌లో జరిగిన దురదృష్టకర సంఘటనలో మనం ఎంతోమందిని కోల్పోయామని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఈసారి దీపావళి సంబరాలను ఎవరూ జరుపుకోవద్దని పార్టీ అధ్యక్షుడు విజయ్ విజ్ఞప్తి చేసినట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో టీవీకే పేర్కొంది. మృతుల జ్ఞాపకార్థం నివాళులు అర్పించాలని కోరింది. దీపావళి వేళ వేడుకలకు బదులుగా మౌనంగా సంతాపం పాటించాలని సూచించింది.

గత నెలలో కరూర్‌లో విజయ్ ప్రసంగించిన సభకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై మొదట మద్రాస్ హైకోర్టులో, ఆ తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. జనసమీకరణ, భద్రతా ఏర్పాట్లలో తీవ్ర లోపాలు ఉన్నాయని గుర్తించిన సర్వోన్నత న్యాయస్థానం, పారదర్శక విచారణ కోసం కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అజయ్ రస్తోగి నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ పర్యవేక్షణలో ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించగా, నటుడు విజయ్ తన పార్టీ తరఫున రూ. 20 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. గాయపడిన వారికి ప్రభుత్వం రూ. 1 లక్ష, విజయ్ రూ. 2 లక్షలు అందజేశారు. కరూర్ విషాదం నుంచి ఇంకా కోలుకోకముందే దీపావళి రావడంతో, పండుగ వేడుకలను రద్దు చేసుకుని మృతులకు నివాళి అర్పించాలని టీవీకే ఈ నిర్ణయం తీసుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande